ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయ వ్యాధి) - కారణాలు, లక్షణాలు, రకాలు, సమస్యలు మరియు నివారణ

Pace Hospitals

Your Webpage Title

Fatty liver meaning in telugu


ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా హెపాటిక్ స్టీటోసిస్ లేదా డిఫ్యూజ్ హెపాటిక్ స్టీటోసిస్, అనగా కాలేయ కణాలలో అధిక కొవ్వు చేరడంతో వచ్చే పరిస్థితి. కొవ్వులను జీవక్రియ చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి కొవ్వు అనేది కాలేయంలో పేరుకుపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సాధారణంగా, కాలేయంలో కొంత మొత్తంలో కొవ్వు ఉంటుంది, కానీ నిక్షేపణ కాలేయ కణాలలో (హెపటోసైట్‌లు) కొవ్వు 5%కి చేరినప్పుడు లేదా అంతకన్నా మించిపోయినప్పుడు, అది అనారోగ్యకరమైన స్థితిగా పరిగణించబడుతుంది.


రాబోయే ఒకటి నుండి రెండు దశాబ్దాలలో (10-20 సంవత్సరాలలో), సిర్రోసిస్‌కు దారితీసే కొవ్వు కాలేయ వ్యాధి అనేది హెపటైటిస్ సి మరియు అధిక ఆల్కహాల్ వినియోగం వల్ల అవసరమయ్యే కాలేయ మార్పిడిని కూడా మించిపోతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కొవ్వు పేరుకుపోవదానికి గల కారణం మరియు దాని పరిధిని బట్టి, కొవ్వులలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవి తేలికగా తిరిగి తగ్గించ గలిగే స్థాయి నుండి తీవ్రమైన స్థాయి వరకు దారితీస్తాయి, ఈ పరిణామం కొన్ని సందర్భాలలో కోలుకోలేని నష్టంతో పాటు కాలేయ కణాల మరణానికి దారితీస్తుంది.


రోగికి ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయ వ్యాధి) ప్రారంభ దశలో ఉన్నట్లయితే, వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు.

fatty liver meaning in telugu | grade 1 fatty liver means in telugu | fatty liver in telugu | fatty liver symptoms telugu

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) రకాలు

Types of fatty liver in telugu



కొవ్వు కాలేయ వ్యాధి యొక్క రకాలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు:

  1. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ (NAFLD)
  2. ఆల్కహాలిక్ లివర్ డిసీస్ (మద్యం సంబంధిత కాలేయ వ్యాధి) లేదా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్


నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ (NAFLD):


ఇది ఎక్కువగా గుర్తించబడిన ఫ్యాటీ లివర్ వ్యాధి, ఈ వ్యాధిలో మద్యాన్ని తీసుకోనప్పటికీ కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సంవత్సరాలు గడిచే కొద్దీ గణనీయమైన నష్టానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితిని నాలుగు దశలుగా విభజించారు, అవి ఏమనగా:

  • నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFL)
  • నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)
  • ఫైబ్రోసిస్
  • సిర్రోసిస్


నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFL): ఇది కాలేయ కణాలకు ఎటువంటి వాపు లేదా హాని కలుగజేయకుండా కాలేయంలో కొవ్వు నిక్షేపణ జరగడం ద్వారా సాధారణ కొవ్వు కాలేయ పరిస్థితిగా కూడా పిలువబడుతుంది. ఇది హెపటోమెగలీ (విస్తరించిన కాలేయం) కారణంగా కడుపులో అసౌకర్యం లేదా నొప్పికి దారితీయవచ్చు.


నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH): ఇది NAFLD యొక్క తీవ్రమైన రూపం. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, వాపు మరియు కాలేయం దెబ్బతినడం వంటివి దీని యొక్క లక్షణాలు. NASH అనేది కాలేయ ఫైబ్రోసిస్, సిర్రోసిస్ మరియు కాలేయ క్యాన్సర్‌కు పురోగమిస్తుంది; దీర్ఘకాలిక హెపటైటిస్ సి వంటి ఇతర కాలేయ వ్యాధులతో NASH పరస్పర ఉనికి గలిగి సంభవించడం జరుగుతుంది.

ఈ NASH అనేది రెండు రకాలుగా వర్గీకరించబడింది:

  • ప్రైమరీ, ఇది అధిక మధ్య వినియోగంతో సంబంధం లేకుండా ఊబకాయం మరియు మధుమేహంతో ముడిపడి ఉంటుంది.
  • సెకండరీ, ఇది డ్రగ్స్ లేదా టాక్సిన్స్ (విషపూరిత పదార్థాలు) ద్వారా ప్రేరేపించబడుతుంది.


ఫైబ్రోసిస్: ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్ అనేది కాలేయంలో దీర్ఘకాలిక వాపు కారణంగా కాలేయం మరియు ప్రక్కనే ఉన్న హెపాటిక్ రక్తనాళాలలో మచ్చ కణజాలం (ఫైబ్రోసిస్) ఏర్పడుతుంది.


సిర్రోసిస్: ఫ్యాటీ లివర్ సిర్రోసిస్ అనేది అత్యంత తీవ్రమైన దశ ఇది దీర్ఘకాలిక వాపు తర్వాత ఉద్భవిస్తుంది, దీనివల్ల కాలేయం సంకోచం చెందుతుంది, అదేవిధంగా శాశ్వత మచ్చలు ఏర్పడి నోడ్యులర్‌గా (వివిధ పరిమాణము గల కంతులతో కూడిన) కనిపిస్తాయి. ఈ తీవ్రత కోలుకోలేనిది, ఇది కాలేయ వైఫల్యానికి మరియు కాలేయ క్యాన్సర్కు దారి తీస్తుంది.


నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి ఉన్న చాలా మంది వ్యక్తులు తరచుగా కొవ్వు కాలేయం లేదా స్టీటోసిస్ అని పిలువబడే పరిస్థితి యొక్క ప్రారంభ దశను కనబరుస్తారు, అయితే కొంతమందిలో మాత్రమే మరింత తీవ్రమైన దశలకు చేరుకుంటుంది. ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ అభివృద్ధి చెందడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు.


నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ (NAFLD) తరచుగా మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం కలిగి ఉంటుంది, ఇది ఊబకాయం, మధుమేహం మరియు హైపర్లిపిడెమియా (రక్తంలో అధిక కొవ్వు) ద్వారా వర్గీకరించబడుతుంది. ఒక పరిశోధనా అధ్యయన నివేదిక ప్రకారం, మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 80% మంది వ్యక్తులు NAFLDతో కూడా బాధపడుతున్నారు.


ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ (మద్యం సంబంధిత కాలేయ వ్యాధి)


ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అని కూడా పిలువబడే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ అనేది, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల (మగవారిలో ≥ 40 గ్రా, ఆడవారిలో ≥ 20 గ్రా మద్యపానం వల్ల) కలిగే జీవక్రియ ప్రభావాల ఫలితంగా వస్తుంది. ఇది కొవ్వు కాలేయ పరిస్థితులలో ఒకటి. ఇథనాల్ని (మద్యం) ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియపై ప్రభావం కారణంగా కొవ్వు కాలేయం అభివృద్ధి చెందుతుంది.

మద్యం వినియోగం వల్ల, కాలేయం మద్యాన్ని వ్యవస్థ నుండి తొలగించడానికి చాలా వరకు జీవక్రియ చేస్తుంది. అయినప్పటికీ, ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేది కాలేయ కణాలకు హాని కలిగించే విషపూరిత సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది, తద్వారా వాపును ప్రేరేపించి శరీరం యొక్క స్వాభావిక రక్షణలను రాజీ చేస్తుంది.

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ సాధారణంగా ఆల్కహాల్ తీసుకోవడం మానేసిన తర్వాత (ఆపివేయడం) మెరుగుపడుతుంది. అయినప్పటికీ, మద్యం సేవించడం కొనసాగితే, అది తీవ్రమైన కాలేయ సమస్యలకు దారి తీస్తుంది.

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ దశలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా స్టీటోసిస్
  • ఆల్కహాలిక్ హెపటైటిస్
  • ఆల్కహాలిక్ సిర్రోసిస్


ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా స్టీటోసిస్: ఇది ఆల్కహాల్ ప్రేరిత కొవ్వు కాలేయం వల్ల వచ్చే పరిస్థితి. ఈ స్థితిలో, కాలేయం విస్తరిస్తుంది, ఇది గుర్తించదగిన లక్షణాలకు కారణం కావచ్చు లేదా కాకపోవచ్చు. ఉదరం యొక్క కుడి ఎగువ ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి అనేది తలెత్తవచ్చు.


ఆల్కహాలిక్ హెపటైటిస్: ఇది కాలేయం యొక్క వాపు ద్వారా వచ్చే ఒక పరిస్థితి, దీని ఫలితంగా జ్వరం, వికారం, వాంతులు, కడుపు నొప్పి మరియు కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.


ఆల్కహాలిక్ సిర్రోసిస్: కాలేయ కణాలు ఫైబ్రస్ మచ్చతో కూడిన కణజాలంను అభివృద్ధి చేసే తీవ్రతరమైన దశ ఇది.


కాలేయం దెబ్బతినే స్థాయి, మద్యాన్ని సేవించే మోతాదును బట్టి పెరుగుతూ ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ అనేది మద్యం తీసుకోవడం వల్ల ఏర్పడే కాలేయ నష్ట ప్రారంభ దశను సూచిస్తుంది, ఇది క్రమేపి ఆల్కహాలిక్ హెపటైటిస్ మరియు సిర్రోసిస్‌లకు దారితీస్తుంది.

fatty liver types in telugu | fatty liver disease in telugu | fatty liver means in telugu | effects of fatty liver in telugu

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయ) వ్యాప్తి

Fatty liver incidence in telugu



  • ఫ్యాటీ లివర్ (హెపాటిక్ స్టీటోసిస్) అనేది అభివృద్ధి చెందిన దేశాలలో కాలేయానికి సంబంధించిన ఒక సాధారణ వ్యాధి. అదేవిధంగా, ఇది ప్రపంచవ్యాప్తంగా సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ మరియు లివర్ క్యాన్సర్‌కు దారితీసే అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. కాలేయ పరిస్థితుల వల్ల వచ్చే అనారోగ్యానికి లేదా మరణానికి దారితీసే కారకాలలో ఇది ముఖ్యమైంది.
  • 2021లో నివేదించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచ జనాభాలో దాదాపు 25% మందికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నట్లు అంచనా వేయబడింది.
  • ఒక పరిశోధన నివేదిక ప్రకారం, కొవ్వు కాలేయ వ్యాధి (NAFLD) యొక్క ప్రాబల్యం ఊబకాయం ఉన్న పెద్దవారిలో 80% -90% వరకు ఉంటుంది, డయాబెటిస్ మెల్లిటస్‌తో (మధుమేహం) బాధపడుతున్న వ్యక్తులలో 30% -50%, హైపర్లిపిడెమియా (రక్తంలో అధిక కొవ్వు ఏర్పడటం) ఉన్న రోగులలో 90% లేదా అంతకంటే ఎక్కువ, అదేవిధంగా చిన్నపిల్లల్లో (పీడియాట్రిక్ జనాభాలో) 3% నుండి 10% మరియు ఊబకాయం (అధిక బరువు) ఉన్న పిల్లలలో 40% నుండి 70% వరకు రావచ్చు అని అంచనా వేయడం జరిగింది.
  • 2020 పరిశోధనా నివేదిక ప్రకారం, వచ్చే దశాబ్దంలో NASH సంభవం 56% వరకు పెరుగుతుందని అంచనా వేయబడింది, కొవ్వు నిల్వల కారణంగా వ్యక్తుల కాలేయంలో వాపు మరియు దెబ్బతినడం సూచిస్తుంది.
  • NAFLD వల్ల కలిగే కాలేయ క్యాన్సర్, ప్రత్యేకంగా హెపాటోసెల్యులర్ కార్సినోమా అనేది ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ఊబకాయం రేటుతో పాటు, ఇది కూడా కలిసి పెరుగుతుంది.
  • రోజువారీ 60 గ్రాముల కంటే ఎక్కువ మద్యాన్ని తాగేవారిలో స్టీటోసిస్ (ఫ్యాటీ లివర్) యొక్క ప్రాబల్యం 46.4% అని ఒక పరిశీలనా అధ్యయనం కనుగొంది. అదనంగా, స్థూలకాయంతో బాధపడుతూ అతిగా తాగేవారిలో స్టీటోసిస్ ప్రాబల్యం మరింత ఎక్కువగా ఉంది, వీరిలో ఇది 94.5%కి చేరుకుంది.
  • మగవారి కంటే తక్కువ మద్యాన్ని తీసుకున్న స్త్రీలు కూడా ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీస్ (ALD)ని ఎక్కువగా అనుభవిస్తారు. ఇది కాలేయంలోని ఆల్కహాల్ ప్రక్రియలలో వైవిధ్యాలు, సైటోకిన్‌ల ఉత్పత్తి, అదేవిధంగా పురుషులు మరియు స్త్రీల కడుపులో ఆల్కహాల్ విచ్ఛిన్నం కావడం వల్ల కావచ్చు.

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయానికి) కారణాలు

Fatty liver causes in telugu



ఫ్యాటీ లివర్ వ్యాధి ఈ క్రింది కారణాల వల్ల తలెత్తవచ్చు:

  • హైపర్లిపిడెమియా (రక్తంలో అధిక కొవ్వు ఏర్పడటం)
  • కాలేయ కణాలకు నష్టం జరగడం


హైపర్లిపిడెమియా: అధిక కొవ్వు వల్ల కాలేయం యొక్క జీవక్రియ సామర్థ్యం అధిగమిస్తుంది. హైపర్లిపిడెమియాకు కారణమయ్యే పరిస్థితులు ఏమనగా:

  • ఊబకాయం
  • మధుమేహం
  • వారసత్వంగా వచ్చే హైపర్లిపిడెమియా


కాలేయ కణాలకు నష్టం: కాలేయ కణాల బలహీనత కారణంగా, కాలేయం అనేది పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేయడం లేదా ప్రాసెస్ చేయడంలో విఫలమవుతుంది. కాలేయ అసాధారణతలకు ఈ క్రింది కారణాలు కారణమౌతాయి, అవేవనగా:

  • ఆకలి
  • దీర్ఘకాలిక వ్యాధులు
  • ఆల్కహాలిక్ కాలేయ వ్యాధి లేదా మధ్య సంబంధిత కాలేయ వ్యాధి (అత్యంత ప్రబలమైనది)
  • ప్రొటీన్-క్యాలరీ పోషకాహార లోపం
  • గర్భధారణ సమయంలో కొవ్వు కాలేయం వల్ల నష్టం ఏర్పడటం
  • రేయీస్ సిండ్రోమ్ (కాలేయం మరియు మెదడులో వాపు ఏర్పడటం)
  • హెపాటోటాక్సిన్స్ (కాలేయానికి నష్టం కలిగించే విషపూరిత రసాయనాలు)
  • డ్రగ్-ప్రేరిత కాలేయ కణ నష్టం

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) లక్షణాలు

కొవ్వు కాలేయ వ్యాధి లక్షణాలు సాధారణంగా లక్షణరహితంగా లేదా తక్కువ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది సాధారణ రక్త పరీక్షల సమయంలో గుర్తించబడుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లక్షణాలు మరియు ఆల్కహాలిక్ నాన్ ఫ్యాటీ లివర్ డిసీస్ లక్షణాలను అనుభవించిన వారు అలసటను గ్రహించవచ్చు లేదా పొత్తికడుపు కుడి ఎగువ ప్రాంతంలో అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఈ సమస్యలు కాలేయ వాపు వల్ల సంభవించవచ్చు.


fatty liver symptoms telugu


కొవ్వు కాలేయ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:

  • ఆకలి లేకపోవడం
  • వాంతులు
  • బరువు తగ్గడం
  • శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించడం


నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి, లివర్ హెపటైటిస్ లేదా లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. అటువంటి సందర్భాలలో వచ్చే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, అయినప్పటికీ, వీటికి మాత్రమే పరిమితం కాదు:

  • పెరిగిన శరీర ఉష్ణోగ్రత
  • చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు)
  • చర్మ దురద
  • దిగువ కాళ్ళు లేదా పాదాలలో ఎడీమా (ద్రవం చేరడం)
  • ఉబ్బరం
  • గందరగోళం
  • పోర్టల్ హైపర్ టెన్షన్ (కాలేయ సిరలో రక్తపోటు)
  • పేగులో రక్తస్రావం
  • మూత్రపిండ వైఫల్యం
  • పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం
  • విస్తరించిన ప్లీహము

పిల్లలలో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) వ్యాధి

Fatty liver disease in children in telugu



2019లో నివేదించబడిన ఒక అధ్యయనం ప్రకారం, పిల్లలలో కొవ్వు కాలేయం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో నమోదు చేయబడింది. ఊబకాయం ఉన్న పిల్లలలో ఇది చాలా సాధారణం. అయితే, సాధారణ శరీర బరువు ఉన్న వ్యక్తులలో కూడా ఇది సంభవించవచ్చు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ (NAFLD) వివిధ వయసుల మరియు శరీర బరువు గల ప్రజలను ప్రభావితం చేస్తుంది.


నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ (NAFLD)తో బాధపడుతున్న పిల్లలకు చిన్న వయస్సులోనే టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. NAFLD అనేది హృద్రోగ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని దాదాపు ఐదు రెట్లు పెంచుతుందని అంచనా వేయబడింది.

పిల్లలలో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) లక్షణాలు

Fatty liver symptoms in children in telugu



పిల్లలలో ఫ్యాటీ లివర్ వ్యాధి అనేది ఒక నిశ్శబ్ద పరిణామం, చాలామంది లక్షణరహితంగా ఉంటారు. అయినప్పటికీ, ఒకవేళ లక్షణాలు సంభవించినట్లయితే, అవి పిల్లల నుండి పిల్లలకి ఒకేవిధంగా ఉండకుండా మారవచ్చు. కానీ కొందరు ఈ క్రింది NAFLD/NASH లక్షణాలను చూపవచ్చు:

  • అనిర్దిష్ట పొత్తికడుపు అసౌకర్యం లేదా అలసట
  • కండరాల నొప్పి
  • ఉబ్బరం
  • యాసిడ్ రిఫ్లక్స్ (ఉదరంలోని ఆమ్లము పైకి ప్రవహించడం)
  • ఎక్కువగా నిద్రపోవడం

స్త్రీలలో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) లక్షణాలు

Fatty liver symptoms in females in telugu



గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు మరియు మెనోపాజ్ (రుతుక్రమం ముగింపు) వల్ల మహిళల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి యొక్క పురోగతి క్రమంగా ఉంటుంది మరియు ఇది ప్రారంభ దశలో గుర్తించదగిన లక్షణాలను ప్రదర్శించకపోవచ్చు. ఇది అభివృద్ధి చెందుతున్నప్పుడు, స్త్రీలలో కొవ్వు కాలేయ వ్యాధి లక్షణాలు క్రింది ఈ విధంగా ఉంటాయి:

  • అలసట
  • ఉదర అసౌకర్యం
  • కాళ్లు లేదా పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం (ఎడీమా)


ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్న మహిళలు ముందుగా ఈ పై వాటిని గుర్తించి ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించి తప్పనిసరిగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

గర్భధారణలో వచ్చే ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం)

Fatty liver during pregnancy in telugu



ప్రెగ్నెన్సీలో ఫ్యాటీ లివర్ (AFLP) అనేది 100,000 గర్భాలలో 5 మందిలో మాత్రమే సంభవించే ఒక అరుదైన పరిస్థితి, ఇది తల్లి మరియు పిండం యొక్క ఆరోగ్యంకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది ప్రధానంగా కాలేయ వ్యాధి యొక్క తీవ్రత ద్వారా వర్గీకరించబడుతుంది. అదేవిధంగా, ఇది గర్భధారణ యొక్క చివరి దశలలో సంభవిస్తుంది. ఈ పరిస్థితికి తక్షణ వైద్య సంరక్షణ మరియు జోక్యం అవసరం.


గర్భం దాల్చిన 20 వారాల తర్వాత కాలేయం పనిచేయకపోవడం (తీవ్రత సంభవించడం) అనేది ప్రయోగశాల మరియు క్లినికల్ అసాధారణతల మద్దతు ద్వారా గుర్తించబడుతుంది, ఇది గర్భంధారణ సమయంలో కొవ్వు కాలేయానికి సంబంధించిన ప్రమాణాలలో ఒకటి.


గర్భధారణ సమయంలో వచ్చే ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమనగా:

  • వికారం
  • వాంతులు
  • ఆకలి లేకపోవడం
  • పొత్తి కడుపులో నొప్పి
  • తలనొప్పి
  • గందరగోళం
  • అనరెక్సియా (తినే రుగ్మత)


కొంతమంది రోగులకు అధిక రక్తపోటు మరియు మూత్రంలో ప్రోటీన్ కూడా ఉండవచ్చు, ఇది హెమోలిసిస్ (ఎర్ర రక్త కణాలు నాశనం అగుట), లివర్ ఎంజైమ్‌లలో పెరుగుదల మరియు తక్కువ ప్లేట్‌లెట్స్ (హెల్ప్) సిండ్రోమ్ లేదా ప్రీ-ఎక్లాంప్సియా (గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు) వంటి పరిస్థితులతో ముడిపడి ఉంటుంది.


గర్భధారణ సమయంలో ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే సమస్యలు


AFLP అనేది ఎన్సెఫలోపతి (మెదడు వ్యాధి), కోగులోపతి (రక్తస్రావ రుగ్మత) మరియు హైపోగ్లైసీమియాతో (రక్తంలో తక్కువ చక్కర స్థాయిలు ఉండటం) సంబంధం ఉన్న కాలేయ వైఫల్యానికి కారణమవుతుంది.

fatty liver grades in telugu | grade 1 fatty liver in telugu | fatty liver pain telugu | telugu fatty liver

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) గ్రేడ్‌లు

Fatty liver grades in telugu



కాలేయ కణాలలో కొవ్వు నిక్షేపణ ఆధారంగా, కొవ్వు కాలేయం లేదా కాలేయ స్టీటోసిస్ యొక్క వివిధ గ్రేడ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ లేదా గ్రేడ్ 1 హెపాటిక్ స్టీటోసిస్
  • గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ లేదా గ్రేడ్ 2 హెపాటిక్ స్టీటోసిస్
  • గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ లేదా గ్రేడ్ 3 హెపాటిక్ స్టీటోసిస్


గ్రేడ్ 1 కొవ్వు కాలేయం: దీనిని తేలికపాటి కొవ్వు కాలేయం లేదా తేలికపాటి హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తారు, ఇందులో కొవ్వు నిక్షేపణ 5%-33% వరకు ఉంటుంది.

గ్రేడ్ 2 కొవ్వు కాలేయం: ఇది ఒక మోస్తరు కొవ్వు కాలేయ పరిస్థితి, ఇందులో 34% నుండి 66% వరకు కొవ్వు పేరుకుపోతుంది.

గ్రేడ్ 3 కొవ్వు కాలేయం: ఇది తీవ్రమైన దశ, ఇందులో కాలేయం 66% కంటే ఎక్కువ కొవ్వు కలిగి ఉంటుంది.

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) యొక్క వ్యాధి కారకాలు

Fatty liver risk factors in telugu



కొవ్వు కాలేయ వ్యాధికి అత్యంత సాధారణ ప్రమాద కారకాల్లో మొదటివి ఊబకాయం మరియు ఆల్కహాల్ వినియోగం (10-12 సంవత్సరాల నుండి ప్రతిరోజూ 40-80 గ్రా వరకు). జనాభాలో పెరుగుతున్న ఊబకాయంతో, కొవ్వు కాలేయం ప్రాబల్యం కూడా పెరుగుతుంది. పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఆల్కహాలిక్ మరియు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి ఈ క్రిందివి వ్యాధి కారకాలుగా ఉన్నాయి:


నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి

  • మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత
  • వృద్ధాప్యం
  • ఆహారపు అలవాట్లు
  • హైపర్లిపిడెమియా (అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు)
  • అధిక రక్తపోటు 
  • మెటబాలిక్ సిండ్రోమ్ (రక్తపోటు, హైపర్‌గ్లైకేమియా, నడుము చుట్టూ అధిక శరీర కొవ్వు మరియు అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు)
  • హెపటైటిస్ సి వంటి ఇన్ఫెక్షన్లు
  • హైపోథైరాయిడిజం (థైరాయిడ్ లోపం)
  • హైపోపిట్యూటరిజం (పిట్యూటరీ హార్మోన్ల లోపం)
  • టాక్సిన్స్ బహిర్గతం
  • మద్యం జీవక్రియను ప్రభావితం చేసే జన్యుపరమైన అంశాలు
  • పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (అండాశయ వ్యాధి) ఉనికి


ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి

  • స్త్రీ లింగం
  • హెపటైటిస్ సి వంటి ముందుగా ఉన్న పరిస్థితులు


పురుషులతో పోల్చినప్పుడు, అదే మొత్తంలో ఆల్కహాల్ తాగడం వల్ల స్త్రీలకు ఆల్కహాలిక్ హెపటైటిస్ మరియు సిర్రోసిస్ వచ్చే ప్రమాదం మరి ఎక్కువగా ఉంటుంది.

అపాయింట్‌మెంట్ కోసం

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) సమస్యలు

Fatty liver complications in telugu



నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి యొక్క సమస్యలు


కింది ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి సమస్యల తీవ్రత అనేది హిస్టాలజీ దశ మరియు కాలేయ వ్యాధి యొక్క గ్రేడ్ని బట్టి ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి యొక్క సమస్యలు ఏమనగా:

  • హెపాటోసెల్యులర్ కార్సినోమా (కాలేయ క్యాన్సర్)
  • కార్డియోవాస్కులర్ వ్యాధి (గుండె సంబంధిత వ్యాధులు)
  • చివరి దశ కాలేయ వ్యాధి


ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి యొక్క సమస్యలు


ఆల్కహాలిక్ కొవ్వు కాలేయం అనేది సాధారణ మరియు అరుదైన సమస్యలను కలిగి ఉంటుంది, సాధారణ సమస్యలు ఏమనగా:

  • స్పాంటేనియస్ బాక్టీరియల్ పెరిటోనిటిస్ (పొత్తికడుపులో ద్రవం చేరడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం)
  • వరిసిల్ హెమరేజ్ (జీర్ణ వాహిక రక్తస్రావం)
  • హెపాటోపల్మోనరీ సిండ్రోమ్ (కాలేయ వ్యాధి వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం)
  • ఎసైటిస్ (పొత్తికడుపులో ద్రవం చేరడం)
  • హెపాటిక్ హైడ్రోథొరాక్స్ (కాలేయ వ్యాధిగ్రస్తుల ప్లురల్ క్యావిటీల్లో ద్రవం చేరుట)
  • హెపటోరీనల్ సిండ్రోమ్ (కాలేయం మరియు మూత్రపిండాలను ప్రభావితం చేసే బహుళ అవయవ రుగ్మత)
  • హెపాటిక్ ఎన్సెఫలోపతి (కాలేయ వ్యాధి వల్ల వచ్చే నరాల రుగ్మత)


ఆల్కహాలిక్ కొవ్వు కాలేయం యొక్క అరుదైన సమస్యలు ఏమనగా:

  • పోర్టల్ సిరల్లో రక్తం గడ్డకట్టడం
  • పోర్టల్ గ్యాస్ట్రోపతి (గ్యాస్ట్రిక్ మ్యూకోసా కుచించడం వల్ల ప్రవాహంలో అడ్డంకి ఏర్పడటం)
  • కాలేయ క్యాన్సర్
  • సిరోటిక్ కార్డియోమయోపతి (లివర్ సిర్రోసిస్ రోగులలో గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం)
  • పోర్టోపల్మోనరీ హైపర్ టెన్షన్ (ఊపిరితిత్తుల ధమనిలో రక్తపోటు)

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) నిర్థారణ

Fatty liver diagnosis in telugu



సాధారణ ప్రయోగశాల పరీక్ష వల్ల ఏమన్నా అసాధారణ కాలేయ పనితీరు నిర్దారించబడుతుంది, తద్వారా కాలేయ పరీక్షలు లేదా హెపాటిక్ స్టీటోసిస్ లేదా కాలేయ కణాల వాపు ఉనికిని బహిర్గతం చేసే ఇమేజింగ్ పరీక్షలను చేసినప్పుడు కొవ్వు కాలేయ నిర్ధారణ యాదృచ్ఛికం చేయబడుతుంది. కొవ్వు కాలేయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అనేవి నిర్దిష్టతను కలిగి ఉండవు అదేవిధంగా NAFLD నుండి NASHని వేరు చేయలేవు.


అయితే, ఫ్యాటీ లివర్ పరిస్థితిని అంచనా వేయడానికి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా హెపాటాలజిస్ట్ సూచించిన ఫ్యాటీ లివర్ పరీక్షలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  1. ఫ్యాటీ లివర్ ల్యాబ్ పరీక్షలు
  2. ఫ్యాటీ లివర్ ఇమేజింగ్ పరీక్షలు
  3. ఫ్యాటీ లివర్ బయాప్సీ పరీక్షలు


ఫ్యాటీ లివర్ ల్యాబ్ పరీక్షలు

  • ALT, AST, ఆల్కలీన్ ఫాస్ఫేటేస్, బిలిరుబిన్, అల్బుమిన్, ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో మొదలైనవాటిని కలిగి ఉన్న పూర్తి కాలేయ ప్రొఫైల్
  • ఫైబ్రోసిస్-4 (Fib-4)
  • NAFLD ఫైబ్రోసిస్ స్కోర్ (NFS)
  • లివర్ ఫైబ్రోసిస్ (ELF) పరీక్ష, ఫైబ్రో టెస్ట్ వంటి వాణిజ్య ఫైబ్రోసిస్ మార్కర్ ప్యానెల్‌లు
  • లిపిడ్ ప్రొఫైల్
  • శరీరంలో ఇనుము స్థాయిలు
  • ఇన్సులిన్ నిరోధక పరీక్ష- క్వాంటిటేటివ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ చెక్ ఇండెక్స్, హోమియోస్టాసిస్ మోడల్ అసెస్‌మెంట్


అసాధారణ కాలేయ ఎంజైమ్‌లు లేదా సిర్రోసిస్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర ఉన్న రోగులలో, ఈ క్రింది అదనపు ప్రయోగశాల పరీక్షలు ఉన్నాయి:

  • ఆల్ఫా 1-యాంటిట్రిప్సిన్
  • యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ పరీక్ష 
  • స్మూత్ మసిల్ యాంటీబాడీ పరీక్ష
  • థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) స్థాయిలు
  • సెరులోప్లాస్మిన్ పరీక్ష మొదలైనవి


ఫ్యాటీ లివర్ ఇమేజింగ్ పరీక్షలు

  • అల్ట్రాసోనోగ్రఫీ
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ
  • మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)
  • రేడియోలాజిక్ పద్ధతులు - అల్ట్రాసౌండ్ తాత్కాలిక ఎలాస్టోగ్రఫీతో అనుబంధించబడిన ఫైబ్రో స్కాన్, ఎకౌస్టిక్ రేడియేషన్ ఫోర్స్ ఇంపల్స్ ఇమేజింగ్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఎలాస్టోగ్రఫీ


ఫ్యాటీ లివర్ బయాప్సీ పరీక్షలు:

  • దీర్ఘకాలిక హెపటైటిస్ మరియు ఫైబ్రోసిస్ నిర్ధారణకు ఇది బంగారు ప్రమాణం; అయినప్పటికీ, వ్యాధి తీవ్రత, ప్రయోగశాల విలువలు మరియు రోగి యొక్క ప్రమాద కారకాలపై ఆధారపడి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కాలేయ బయాప్సీని సూచిస్తారు, ఎందుకంటే ఈ పరీక్ష సాధారణ సీరం అమినోట్రాన్స్‌ఫేరేసెస్ స్థాయిలు ఉన్న రోగులలో సూచించబడదు.

ఫ్యాటీ లివర్కి (కొవ్వు కాలేయానికి) చికిత్స

Fatty liver treatment in telugu



కొవ్వు కాలేయ వ్యాధి చికిత్సని, హెపాటిక్ స్టీటోసిస్ చికిత్స అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా జీవనశైలి మార్పులు, కొవ్వు కాలేయ వ్యాధి యొక్క అంతర్లీన కారణాల నిర్వహణ, అదనపు శరీర బరువును తగ్గించడం, పెరిగిన రక్త లిపిడ్ స్థాయిలును పూర్వస్థితికి తీసుకురావడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ సాధారణీకరణ మరియు టైప్ 2 మధుమేహంకు చికిత్స వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది.


వివిధ చికిత్సా పద్ధతులు ఏమనగా:

  • యాంటీఆక్సిడెంట్లు (విటమిన్ E థెరపీ)
  • ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు
  • గ్లూకాగాన్ లాంటి పెప్టైడ్స్ (GLP1) అగోనిస్ట్‌లు
  • స్టాటిన్స్ (ఫ్యాటీ లివర్ రోగులలో డిస్లిపిడెమియా చికిత్సకు)
  • బేరియాట్రిక్ సర్జరీ (తీవ్రమైన ఊబకాయం ఉన్న రోగులకు)
  • కాలేయ మార్పిడి (కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లయితే)

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) వ్యాధి నివారణ

Fatty liver prevention in telugu



ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అభ్యసించడం ద్వారా కొవ్వు కాలేయ నివారణను సాధించవచ్చు:

  • శరీర బరువులో 5% నుండి 10% వరకు ఆరోగ్యవంతంగా తగ్గడం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
  • ఉప్పు, పంచదార మరియు నూనెలు పరిమితంగా తీసుకోవడం. అదేవిధంగా ప్రోటీన్లు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి సమతుల్య ఆహారం ఎక్కువగా తీసుకోవడం. 
  • సూచించిన మందులను తీసుకోవడం ద్వారా రక్తపోటు, మధుమేహం మరియు హైపర్లిపిడెమియా వంటి పరిస్థితుల ఉనికిని నియంత్రించడం
  • మద్య వినియోగాన్ని నివారించడం మొదలైనవి

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) మరియు సాధారణ కాలేయం మధ్య వ్యత్యాసం

Fatty Liver vs Normal Liver in telugu



సాధారణ కాలేయం కొవ్వు జాడలను కలిగి ఉంటుంది; ఒకవేళ, ఈ కొవ్వు అనేది కాలేయంలో 5% కంటే ఎక్కువ ఉంటే, దానిని కొవ్వు కాలేయం అంటారు. సాధారణ మరియు కొవ్వు కాలేయాల మధ్య తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అంశాలు సాధారణ కాలేయం కొవ్వు కాలేయం
భౌతిక అన్వేషణ సగటు పరిమాణం స్త్రీలలో 7cm మరియు పురుషులలో 10.5 cm (సాధారణంగా) సాధారణ పరిమాణం కంటే 2 నుండి 3 సెం.మీ ఎక్కువ
కాలేయం ఆకారం కోన్ ఆకారం కలిగి మరియు ముదురు ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది పెద్దగా ఉండి రంగులో మార్పు ఉంటుంది
ల్యాబ్ (ప్రయోగశాల) పరీక్షలు సాధారణ కాలేయ పనితీరు పరీక్షలు ALT, AST, అల్బుమిన్, ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ మొదలైన అసాధారణ కాలేయ పనితీరు పరీక్షలు అవసరం.
లక్షణాలు లక్షణాలు ఉండవు ఆకలి లేకపోవడం, వాంతులు, బరువు తగ్గడం, అలసట, కడుపు నొప్పి, చర్మ దురద మొదలైనవి

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మరియు ఫ్యాటీ లివర్ మధ్య వ్యత్యాసం

Non-alcoholic Fatty Liver vs Alcoholic Fatty Liver in telugu



నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మరియు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ రెండూ కూడా కాలేయ సమస్యలే, వీటిని ఆల్కహాల్ మానేయడం, రోజువారీ వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు వంటి జీవనశైలి మార్పుల సహాయంతో ప్రారంభ దశలో చికిత్స చేయవచ్చు. అయితే, వీటి మధ్య ఈ క్రింది తేడాలు ఉన్నాయి.

అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్
స్టీటోసిస్ జీవక్రియ అసాధారణతల కారణంగా కాలేయంలో అదనపు కొవ్వు చేరుతుంది ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం (మగవారిలో 40గ్రా, ఆడవారిలో 20-30గ్రా మద్యపానం)
లక్షణాలు అలసట, ఊబకాయం, పొత్తికడుపు నొప్పి, విస్తరించిన కాలేయం, మెడ మరియు కీళ్ల చుట్టూ నల్లబడిన పిగ్మెంటేషన్ కామెర్లు, బరువు తగ్గడం, అతిసారం మరియు పోర్టల్ హైపర్‌టెన్షన్
వ్యాధి కారకాలు ఊబకాయం, మధుమేహం మరియు హైపర్లిపిడెమియా మద్యపానం, స్త్రీ లింగం, హెపటైటిస్ సి వంటి ముందస్తు పరిస్థితులు
చికిత్స జీవనశైలి మార్పులు: బరువు తగ్గడం, అదేవిధంగా మధుమేహం, హైపర్‌టెన్షన్ మరియు హైపర్‌లిపిడెమియా వంటి వ్యాధులను తగ్గించుకోవడం మద్యపానాన్ని నిషేధించడం, పోషకాహారం తీసుకోవడం, మరియు వాపు కోసం గ్లూకోకోర్టికోస్టెరాయిడ్స్ మందులు వాడటం మొదలైనవి

అపాయింట్‌మెంట్ కోసం

ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) గురించి తరుచుగా అడుగు ప్రశ్నలు


  • ఫ్యాటీ లివర్‌ని ఎలా తగ్గించుకోవాలి?

    ఫ్యాటీ లివర్ అనేది కాలేయ కణజాలంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల సంభవించే ఒక వ్యాధి, ఇది కాలేయం యొక్క వాపుకు దారితీస్తుంది.


    ఫలితంగా సాధారణ స్టీటోసిస్, ఆల్కహాల్-ప్రేరిత కాలేయ వ్యాధి మరియు ఆల్కహాలిక్ కాని కొవ్వు కాలేయంకు దారితీస్తుంది. మద్యపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు తగ్గించుకోవడం, ప్రొటీన్లు మరియు ఫైబర్‌లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మొదలైన జీవనశైలి మార్పులను అనుసరించడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చు. కొవ్వు కాలేయం యొక్క ప్రారంభ దశను ఆలస్యంగా నిర్ధారణ చేస్తే కాలేయ ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. కాలేయ విచ్ఛేదనం లేదా కాలేయ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు మాత్రమే ఈ కోలుకోలేని దశను నయం చేస్తాయి.

  • ఫ్యాటీ లివర్కి పాలు మంచిదా?

    అవును, కొవ్వు కాలేయ రోగులకు పాల వినియోగం మంచిది. కొవ్వు కాలేయం (NAFLD) అనేది ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం మరియు జీవక్రియ సిండ్రోమ్ వంటి జీవక్రియ అసాధారణతలతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. డైరీ ప్రొటీన్, పాల ఉత్పత్తులు మరియు పాలవిరుగుడు ప్రోటీన్ (కేసిన్ ఎక్కువగా ఉంటుంది) అనేవి జీవక్రియ రుగ్మతలను తగ్గించే సామర్థ్యాన్నికలిగి ఉంటాయి.


    50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో తక్కువ డైరీ ప్రోటీన్‌ను తీసుకునే వారి కంటే ఎక్కువ డైరీ ప్రోటీన్‌లను తీసుకునే వారిలో కొవ్వు కాలేయం (NAFLD) తక్కువుగా అభివృద్ధి చెందుతుందని ఒక అధ్యయనం కనుగొంది.

  • ఫ్యాటీ లివర్ని నయం చేయడానికి ఏ ఆహారాలు సహాయపడతాయి?

    హెపాటిక్ స్టీటోసిస్ డైట్ పద్ధతులను అవలంబించడం ద్వారా నివారణ మరియు చికిత్స ప్రభావాలు పొందవచ్చు. ఈ డైట్లో కేలరీల తీసుకోవడం తగ్గించడం, సోయా ప్రోటీన్ మరియు పాలవిరుగుడు ప్రోటీన్ల వినియోగాన్ని పెంచడం అదేవిధంగా మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోబయోటిక్స్, కొన్ని సప్లిమెంట్లను ఆహార భాగంలో చేర్చడం అనేది ఉంటుంది. దీనికి అదనంగా కోలిన్ అధికంగా ఉండే ఆహారాలు, కాఫీ, గ్రీన్ టీ, పండ్లు, కూరగాయలు, గింజలు, వెల్లుల్లి, చేపలు, ఆలివ్ నూనె, తృణధాన్యాలు మరియు మితమైన మద్యపానం ఉన్నాయి.

  • ఫ్యాటీ లివర్ని నయం చేయడానికి వేగవంతమైన మార్గం ఏమిటి?

    కొవ్వు కాలేయాన్ని ప్రాథమిక దశలో ఉన్నప్పుడే త్వరగా నయం చేయవచ్చు. జీవనశైలిలో మార్పులు చేయడం, సాధారణ వ్యాయామం, సమతుల్య హెపాటిక్ స్టీటోసిస్ ఆహారం మరియు బరువు నిర్వహణ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం ద్వారా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్  (NAFLD)ని నివారించవచ్చు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ అనేది, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వల్ల నయం చేయడంలో సులభతరమౌతుంది.

  • ఫ్యాటీ లివర్ని ఎలా తెలుసుకోవాలి?

    కొవ్వు కాలేయాన్ని గుర్తించడానికి ఈ  క్రింది పరీక్షలు అవసరం, అవేవనగా:

    • రక్త పరీక్షలు

    • మాగ్నెటిక్ రెసొనెన్స్ ఎలాస్టోగ్రఫీ, ట్రాన్సియెంట్ ఎలాస్టోగ్రఫీ (ఫైబ్రో స్కాన్), మరియు అల్ట్రాసౌండ్ వంటి ఇమేజింగ్ విధానాలు

    • లివర్ బయాప్సీ

  • ఫ్యాటీ లివర్కి గ్రీన్ టీ మంచిదా?

    అవును, ఆల్కహాలిక్ కాలేయ వ్యాధిని తగ్గించడానికి గ్రీన్ టీ మంచిది. గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్లు (యాంటీ ఆక్సిడెంట్) ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడి మరియు తాపజనక ప్రతిస్పందనలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం, 12 వారాలపాటు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ALT (అలనైన్ ట్రాన్సామినేస్) మరియు AST (ఆస్పార్టేట్ అమినోట్రాన్స్‌ఫేరేస్) స్థాయిలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

  • గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ని నయం చేయవచ్చా?

    అవును, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, అనేది తేలికపాటి హెపాటిక్ స్టీటోసిస్‌గా పరిగణించబడుతుంది, రోగి స్థిరంగా సరైన హెపాటిక్ స్టీటోసిస్ డైట్ మరియు వ్యాయామ నియమాన్ని అనుసరిస్తే ఈ సమస్యను నయం చేయవచ్చు. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ చికిత్సకు నిర్దిష్టమైన మందులు అందుబాటులో లేవు. గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 3 కొవ్వు కాలేయం పరిస్థితికి తగిన వైద్య చికిత్స అనేది మరింత అవసరం.

  • గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ని నయం చేయవచ్చా?

    అవును, ఇది నయమవుతుంది, కానీ ఇది వ్యాధి యొక్క ప్రారంభ గుర్తింపు మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది; గ్రేడ్ 2 కొవ్వు కాలేయం అనేది 34% నుండి 66% కొవ్వుతో మితమైన మంటను కలిగి ఉంటుంది; చికిత్స చేయకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది మరియు గ్రేడ్ 3కి దారితీస్తుంది. ప్రారంభ రోగ నిర్ధారణ అనేది నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

  • కొవ్వు కాలేయాన్ని నయం చేసి పూర్వస్థితికి ఎలా తీసుకురావాలి?

    ఫ్యాటీ లివర్‌ను ముందుగా గుర్తిస్తే సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు. అందువల్ల, సమర్థవంతమైన పూర్వస్థితి కోసం ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం, మరియు కోలుకునే అవకాశాలు అనేవి వ్యాధి గుర్తింపు సమయంపై ఆధారపడి ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం అనేవి ప్రారంభ దశలో కాలేయ నష్టాన్ని సమర్థవంతంగా నిరోధించి, పూర్వస్థితికి తెస్తుంది.

  • కొవ్వు కాలేయానికి ఎలా చికిత్స చేయాలి?

    కొవ్వు కాలేయ వ్యాధికి ఆమోదించబడిన ఔషధ చికిత్స లేదు. NAFLDని తగ్గించడానికి అదనపు శరీర బరువు, ఎలివేటెడ్ బ్లడ్ లిపిడ్ స్థాయిలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు టైప్ 2 మధుమేహం మొదలైన అనుసంధాన పరిస్థితులను ముందుగా పరిష్కరించాలి.


    బరువు తగ్గించే ప్రయత్నాలు, మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలను నియంత్రించడం ద్వారా NAFLD యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించి మరియు స్థితిని మెరుగుపరచవచ్చు. మద్యం వినియోగాన్ని తగ్గించడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్  అనేది  తగ్గుతుంది.

  • ఆల్కహాలిక్ హెపాటిక్ స్టీటోసిస్ని తాగించి పూర్వస్థితికి తీసుకురావచ్చా?

    మద్యం-సంబంధిత కొవ్వు కాలేయం ఉన్న వ్యక్తులలో మద్యం నుండి దూరంగా ఉండటం వల్ల హెపాటిక్ స్టీటోసిస్‌ను తగ్గించవచ్చు. స్టీటోసిస్ సాధారణంగా ఆల్కహాల్ తీసుకోవడం మానేసిన రెండు వారాల్లోనే పరిష్కారమౌతుంది. 

    మద్యం నుండి దూరంగా ఉండటం అనేది మనుగడను మెరుగుపరచడంలో  కీలక పాత్ర పోషిస్తుంది.


  • ఫ్యాటీ లివర్ని నిర్విషీకరణ చేయడం ఎలా?

    ఈ క్రింది ఆహారాలను ఆహారంలో భాగం చేయడం ద్వారా కాలేయ నిర్విషీకరణ సాధ్యపడుతుంది:

    • ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలు మరియు గింజలు, ఇవి వాపును తగ్గించడంలో మరియు కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

    • కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా పసుపు, పసుపు శరీరం నుండి విషపూరిత సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుంది.

    • ఆకు కూరలు, ఆకుకూరలు అనేవి బరువు, మధుమేహం మరియు అధిక రక్తపోటును తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

    • కాఫీ తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గుతుంది.

    • ఆలివ్ ఆయిల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

    • తృణధాన్యాలు కాలేయంలో చక్కెర నిల్వను తగ్గించడంలో సహాయపడతాయి.

  • ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఏమి తినకూడదు?

    సాధారణంగా, అధిక కేలరీల ఆహారాన్ని తీసుకోవడం, ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ మరియు ఫ్రక్టోజ్-తీపి పానీయాలు అనేవి అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి (విసెరల్ అడిపోసిటీకి) దోహదం చేస్తాయి. తద్వారా, కాలేయం వాపుకు గురవుతుంది.


    ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, కాల్చిన లేదా  వేయించిన ఆహారాలు, సోడాలు, చిరుతిండి, చీజ్ (వెన్న) మరియు స్వీట్లు వంటివి కొవ్వు కాలేయంతో బాధపడుతున్నవారు నివారించాల్సిన ఆహారాలు.

  • ఫ్యాటీ లివర్కి చికెన్ మంచిదా?

    అవును, లీన్ చికెన్ తీసుకోవడం ఫ్యాటీ లివర్‌కు మంచిది. అధిక సంతృప్త కొవ్వుల వినియోగం, మరియు ఫైబర్, ప్రోటీన్ల లోపం వల్ల కొవ్వు కాలేయం ఏర్పడుతుంది. అందువల్ల, లీన్ చికెన్ అనేది  ప్రోటీన్కు గొప్ప మూలం.

  • ఆల్కహాలిక్ కాలేయ వ్యాధిలో ALT కంటే AST ఎందుకు ఎక్కువగా ఉంటుంది

    ALT మరియు AST అనేవి కాలేయ ఎంజైమ్‌లు, ఇవి సాధారణంగా కాలేయ అసాధారణత సంభవించినప్పుడు పెరుగుతాయి. 


    అయినప్పటికీ, ఆల్కహాల్-ప్రేరిత కాలేయ వ్యాధి విషయంలో, ALTతో పోల్చితే అధిక AST స్థాయిలు ఉంటాయి. ఇది AST మైటోకాన్డ్రియాల్ దెబ్బతినడం వల్ల, సీరంలో AST మరియు కాలేయంలో B6 క్షీణత పెరిగి, ALT స్థాయిలు తగ్గుతాయి.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

Successful Total Knee Replacement Surgery for Right Knee Osteoarthritis at PACE Hospitals
By PACE Hospitals December 30, 2025
Explore a case study of a 63-year-old female treated at PACE Hospitals by orthopaedic surgeons for right knee osteoarthritis using total knee replacement.
Successful Open reduction with Plating done for Right Proximal Humerus Fracture at PACE Hospitals
By PACE Hospitals December 29, 2025
Explore a case study of a 38-year-old male treated at PACE Hospitals by orthopaedic surgeons for right proximal humerus fracture using open reduction and plating.
Grade VI baldness Treated with FUE Hair Transplant in 45 YO
By PACE Hospitals December 27, 2025
Explore the case Study on FUE hair transplantation for Grade VI baldness at PACE Hospitals, Hyderabad, highlighting 3,900 grafts, procedure details, recovery, and outcomes.
Interventional radiology podcast on liver cancer HCC treatment at PACE Hospitals
By PACE Hospitals December 27, 2025
Join the PACE Hospitals Podcast with Dr. Lakshmi Kumar to learn how interventional radiology treats liver cancer (HCC) using minimally invasive therapies.
Best Doctor for Pilonidal Sinus in Hyderabad | Pilonidal Sinus Specialist Doctor
By PACE Hospitals December 26, 2025
Consult the best doctors for pilonidal sinus treatment in Hyderabad at PACE Hospitals for accurate diagnosis, advanced procedures, and safe, effective relief.
Successful endoscopic mucosal resection done for gastric polyps treatment at PACE Hospitals
By PACE Hospitals December 23, 2025
Case study of a 63-year-old male treated at PACE Hospitals by gastroenterologists using successful endoscopic mucosal resection for gastric polyps.