పిత్తాశయ క్యాన్సర్ - రకాలు, కారణాలు, లక్షణాలు, చికిత్స & నివారణ
PACE Hospitals
పిత్తాశయ క్యాన్సర్ నిర్వచనం
Definition of Gallbladder Cancer in Telugu
పిత్తాశయం కార్సినోమా లేదా పిత్తాశయ క్యాన్సర్ అనేది ఒక అరుదైన వ్యాధి, ఇందులో పిత్తాశయంలోని అసాధారణ కణాలు నిరంతరం పెరిగి ట్యూమర్ను ఏర్పరుస్తాయి. ఏ ప్రత్యేక కణాలు దెబ్బతిన్నాయో అనేది ట్యూమర్ రకాన్ని నిర్ణయిస్తుంది. చాలా సందర్భాల్లో పిత్తాశయ క్యాన్సర్ (GBC) యొక్క ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలియదు, కానీ పిత్తాశయం యొక్క దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (వాపు), ఊబకాయం, పిత్త రాళ్లు మరియు కొంతమంది జన్యు సంబంధిత పరిస్థితులు పిత్తాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు.
అధునాతన దశలో కనిపించే లక్షణాలు ఉదర నొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం, వికారం, జాండిస్ మరియు పిత్తాశయం పెరగడం. ప్రారంభ దశల్లో సాధారణంగా లక్షణాలు లేకపోవడం వల్ల పిత్తాశయ క్యాన్సర్ను తొలిదశలో గుర్తించడం కష్టం.
ఆంకాలజిస్టులు లేదా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు సాధారణంగా పిత్తాశయ క్యాన్సర్ (GBC) ను చికిత్స చేస్తారు. ప్రారంభ దశల్లో పిత్తాశయ క్యాన్సర్కు ప్రధాన చికిత్స శస్త్రచికిత్స, ఇందులో పిత్తాశయాన్ని పూర్తిగా తొలగించవచ్చు.
పిత్తాశయ క్యాన్సర్ అర్థం
Meaning of Gallbladder Cancer in Telugu
పిత్తాశయ క్యాన్సర్” అనే పదం రెండు పదాల కలయిక: పిత్తాశయం మరియు క్యాన్సర్.
- "Gallbladder (పిత్తాశయం)"
- “Gall” అంటే పిత్తం, ఇది పాత ఆంగ్ల పదం "Galla" నుండి వచ్చింది.
- “Bladder” అంటే సంచి లేదా నిల్వ చేసే భాగం.
- "Cancer (క్యాన్సర్)"
- ఇది గ్రీకు పదం "karkinos" నుండి వచ్చింది. దీనికి పీత, ట్యూమర్ మరియు పీత రాశి అనే అర్థాలు ఉన్నాయి. పాత ఆంగ్లంలో దీనికి “వ్యాపించే పుండు” అనే అర్థం కూడా ఉంది.
పిత్తాశయ క్యాన్సర్ అనేది పిత్తాశయం కణజాలాల్లో ఏర్పడే ట్యూమర్. పిత్తాశయం అనేది కాలేయం క్రింద ఉండే పియర్ ఆకారపు అవయవం, ఇది పిత్తాన్ని నిల్వ చేస్తుంది.
పిత్తాశయ క్యాన్సర్ గణాంకాలు
Gallbladder Cancer Statistics in Telugu
ప్రపంచవ్యాప్తంగా పిత్తాశయ క్యాన్సర్ సంభవ రేటు
పిత్తాశయ క్యాన్సర్ 2022లో 22వ అత్యంత సాధారణ క్యాన్సర్గా నమోదైంది, ప్రపంచవ్యాప్తంగా 1,22,491 కొత్త కేసులు నివేదించబడ్డాయి. ప్రపంచ సగటు సంభవ రేటు ప్రతి 1 లక్ష మందికి 2.2 గా ఉంది. బొలీవియా, చిలీ, బంగ్లాదేశ్ మరియు నేపాల్ దేశాల్లో అత్యధిక సంభవ రేట్లు నమోదయ్యాయి. పిత్తాశయ క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా సంభవించే మొత్తం క్యాన్సర్ కేసుల్లో 1.2% మరియు క్యాన్సర్కు సంబంధించిన మొత్తం మరణాల్లో 1.7% ను కలిగి ఉన్నాయి.
భారతదేశంలో పిత్తాశయ క్యాన్సర్ సంభవం
భారతదేశంలో పిత్తాశయ క్యాన్సర్ (GBC) ప్రబలత గణనీయంగా ఉంది, ఇది ప్రపంచ మొత్తం కేసుల్లో సుమారు 10% ను కలిగి ఉంది. ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలో సంభవ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు ఇవి బొలీవియా మరియు చిలీ రేట్లకు సమానంగా ఉంటాయి. ఢిల్లీలో, పురుషులలో 1 లక్ష మందికి 4.1 మరియు మహిళల్లో 1 లక్ష మందికి 9.5 రేటుగా అంచనా వేయబడింది.

పిత్తాశయ క్యాన్సర్ రకాలు
Types of Gallbladder Cancer in Telugu
పిత్తాశయ కార్సినోమా (పిత్తాశయ క్యాన్సర్) కు అనేక రకాలు ఉంటాయి. క్యాన్సర్ ఏ కణంలో ప్రారంభమైందో దాని ఆధారంగా రకం నిర్ణయించబడుతుంది. వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే రకం అడెనోకార్సినోమా.
పిత్తాశయ క్యాన్సర్ యొక్క రకాలు:
- అడెనోకార్సినోమా
- పాపిల్లరీ అడెనోకార్సినోమా
- మ్యూసినస్ అడెనోకార్సినోమా
- నాన్-పాపిల్లరీ అడెనోకార్సినోమా
- స్క్వామస్ సెల్ కార్సినోమా
- అడెనోస్క్వామస్ కార్సినోమా
- స్మాల్ సెల్ కార్సినోమా
- సార్కోమా
- న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లు
- లింఫోమా మరియు మెలనోమా
అడెనోకార్సినోమా: ఇది పిత్తాశయ క్యాన్సర్లో అత్యంత ప్రబలమైన రకం, మొత్తం పిత్తాశయ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 90% ను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా మ్యూకస్ను ఉత్పత్తి చేసే పిత్తాశయం పొరలోని గ్రంథి కణాల్లో ప్రారంభమవుతుంది. పిత్తాశయ అడెనోకార్సినోమా లో మూడు రకాలు ఉన్నాయి. అవి:
పాపిల్లరీ అడెనోకార్సినోమా: పాపిల్లరీ అడెనోకార్సినోమాలు పిత్తాశయాన్ని బలపరిచే కనెక్టివ్ టిష్యూలో ఏర్పడతాయి. ఈ రకం పిత్తాశయ క్యాన్సర్ కాలేయం మరియు సమీపంలోని లింఫ్ నోడ్స్కు వ్యాపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది ఇతర పిత్తాశయ క్యాన్సర్ రకాలతో పోలిస్తే సాధారణంగా మెరుగైన ప్రోగ్నోసిస్ కలిగి ఉంటుంది.
- మ్యూసినస్ అడెనోకార్సినోమా: మ్యూసినస్ అడెనోకార్సినోమాలలో, క్యాన్సర్ కణాలు సాధారణంగా మ్యూకస్ గుంపుల్లో కనిపిస్తాయి.
- నాన్పాపిల్లరీ అడెనోకార్సినోమా: ఇది అత్యంత సాధారణ ఉపరకం, మొత్తం కేసులలో సుమారు 90% ఈ రకానికి చెందివుంటాయి.
స్క్వామస్ సెల్ క్యాన్సర్: స్క్వామస్ సెల్ కార్సినోమాలు పిత్తాశయం మరియు గ్రంథి కణాలను కప్పి ఉంచే చర్మంలాంటి కణాల నుండి పెరుగుతాయి. ఇవి అడెనోకార్సినోమాల మాదిరిగానే చికిత్స చేయబడతాయి. స్క్వామస్ సెల్ కార్సినోమాలు మొత్తం పిత్తాశయ క్యాన్సర్లలో సుమారు 5% ఉంటాయి.
అడెనోస్క్వామస్ క్యాన్సర్: అడెనోస్క్వామస్ కార్సినోమాలలో స్క్వామస్ మరియు గ్రంథి కణాల రెండు రకాల క్యాన్సర్ కణాలు ఉంటాయి. ఈ మాలిగ్నెన్సీలు (క్యాన్సర్లు) కూడా అడెనోకార్సినోమాల్లాగే చికిత్స చేయబడతాయి.
స్మాల్ సెల్ కార్సినోమా: ఇవీ క్యాన్సర్ కణాల ఓట్-లాంటి ఆకారాల కారణంగా ఓట్ సెల్ కార్సినోమాలు అని కూడా పిలుస్తారు.
సార్కోమా: సార్కోమా అనేది శరీరం యొక్క మద్దతు లేదా రక్షణ అందించే కణజాలాలను ప్రభావితం చేసే క్యాన్సర్. వీటిని సాధారణంగా కనెక్టివ్ టిష్యూ అంటారు. కండరాలు, నరాలు మరియు రక్తనాళాలు అన్నీ కనెక్టివ్ టిష్యూలో భాగం. పిత్తాశయం యొక్క కండరాల పొరలో ప్రారంభమయ్యే క్యాన్సర్ను సార్కోమా అంటారు.
న్యూరోఎండోక్రైన్ ట్యూమర్: న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లు హార్మోన్లు ఉత్పత్తి చేసే కణాల నుండి ఉద్భవించే అరుదైన మాలిగ్నెన్సీలు, ఇవి సాధారణంగా జీర్ణవ్యవస్థలో కనిపిస్తాయి. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లో అత్యంత సాధారణ రకం కార్సినాయిడ్ ట్యూమర్.
లింఫోమా మరియు మెలనోమా: ఇవి చాలా అరుదుగా కనిపించే పిత్తాశయ క్యాన్సర్ రకాలుగా ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ ఇతర రకాల మాదిరిగా చికిత్స చేయబడవు.

పిత్తాశయ క్యాన్సర్ లక్షణాలు
Gallbladder Cancer Symptoms in Telugu
పిత్తాశయ క్యాన్సర్ ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం, ఎందుకంటే సాధారణంగా ఈ సమయంలో ఏ లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించినప్పుడు, అవి తరచుగా పిత్త రాళ్లు వంటి ఇతర పరిస్థితుల లక్షణాలకు సమానంగా ఉంటాయి.
అధునాతన దశలో పిత్తాశయ క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో కనిపించే సాధారణ లక్షణాలు
- కుడి పై భాగంలో ఉదర నొప్పి
- జాండిస్ (కళ్ల మరియు చర్మం పసుపు రంగులో మారడం)
- పిత్తాశయం పెరగడం
- వికారం (అసహనం భావన)
- వాంతులు
తక్కువగా కనిపించే లక్షణాలు
- కారణం లేకుండా బరువు తగ్గడం
- ఆకలి లేకపోవడం
- ఉదరంలో వాపు
- జ్వరం
- నల్లటి రంగులో మలం
- చర్మం దురద

పిత్తాశయ క్యాన్సర్ కారణాలు మరియు ప్రమాద కారకాలు
Gallbladder Cancer Causes and Risk Factors in Telugu
పిత్తాశయ క్యాన్సర్ (GBC) అనేది అరుదుగా కనిపించే, కానీ వేగంగా వ్యాపించే క్యాన్సర్, దీనికి పలు ప్రమాద కారకాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో పిత్తాశయ క్యాన్సర్కు ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలియదు. క్రింది ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు.
కోలిలిథియాసిస్ (పిత్త రాళ్లు): పిత్త రాళ్లు పిత్తాశయ క్యాన్సర్ (GBC) కు ప్రధాన ప్రమాద కారకం. అధ్యయనాలు చెబుతున్నట్లు, ఈ పరిస్థితితో నిర్ధారించబడిన పేషెంట్స్ లో 75–80% మందికి పిత్త రాళ్ల చరిత్ర ఉంది. పిత్త రాళ్ల వలన ఏర్పడే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (వాపు), పిత్తాశయం మ్యూకోసాలో కార్సినోజెనిక్ మార్పులు కలిగించవచ్చు.
దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (వాపు): దీర్ఘకాలిక పిత్తాశయ వాపు, సాధారణంగా పిత్త రాళ్లు లేదా క్రానిక్ కొలేసిస్టైటిస్ కారణంగా ఏర్పడుతుంది, ఇది పలు GBC ప్రమాద కారకాలతో సంబంధం కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (వాపు), కణాల్లో మార్పులు కలిగించి క్యాన్సర్ వృద్ధికి దారితీయవచ్చు.
వయస్సు: వయస్సు పెరుగుదలతో పిత్తాశయ క్యాన్సర్ (GBC) వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రత్యేకంగా 60 సంవత్సరాల పైబడినవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిత్తాశయ క్యాన్సర్ నిర్ధారణ సగటు వయస్సు సుమారు 72 సంవత్సరాలు.
లింగం: మహిళల్లో ఇది పురుషులతో పోలిస్తే 3 నుండి 4 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు కారణం మహిళల్లో పిత్త రాళ్లు మరియు దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (వాపు) ఎక్కువగా ఉండటం అయ్యిఉండవచ్చు.
ఆహారం: అధిక కొవ్వు కలిగిన ఆహారం, ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ మరియు చక్కెర ఉన్న ఆహారం, పిత్త రాళ్లు మరియు దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు, పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉన్న ఆహారం ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఊబకాయం: అధిక బరువు లేదా ఊబకాయంతో ఉండేవారిలో పిత్త రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పిత్తాశయ క్యాన్సర్ (GBC) ప్రమాదం కూడా పెరుగుతుంది.
కుటుంబ చరిత్ర: పిత్త రాళ్లు లేదా GBC యొక్క కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ప్రమాదం ఎక్కువ. వారసత్వ కారకాలు పిత్త రాళ్లకు మద్దతు ఇచ్చే స్వభావం కలిగి ఉంటాయి, తద్వారా GBC వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
పిత్తాశయం పాలిప్స్: పిత్తాశయంలో పాలిప్స్ ఉండటం క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచవచ్చు.
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు: సాల్మొనెల్లా టైఫీ వంటి కొన్ని ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్కు కారణమవ్వడం వల్ల GBC వృద్ధి ప్రమాదాన్ని పెంచుతాయి.
పోర్సలిన్ పిత్తాశయం: దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కారణంగా పిత్తాశయం లోపలి గోడపై కాల్షియం పొరలు పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఉన్నవారిలో పిత్తాశయ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.
ప్రైమరీ స్క్లెరోసింగ్ కోలాంగిటిస్ (PSC): ఇది పిత్తనాళాల ఇన్ఫ్లమేషన్. ఇది అరుదుగా కనిపించే సమస్య మరియు దీని ఖచ్చితమైన కారణం వైద్యులకు తెలియదు. ఈ పరిస్థితి ఉన్నవారికి పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పిత్తాశయ క్యాన్సర్ వలన కలిగే సమస్యలు
Complications of Gallbladder Cancer in Telugu
పిత్తాశయ క్యాన్సర్ (GBC) పేషెంట్ ఆరోగ్యాన్ని మరియు చికిత్స ఫలితాలను ప్రభావితం చేసే అనేక ప్రధాన సమస్యలను కలిగించవచ్చు. ఈ పరిస్థితికి సంబంధించిన ముఖ్యమైన సంక్లిష్టతలు క్రింది విధంగా ఉన్నాయి:
ఉదర నొప్పి: పేషెంట్ లు సాధారణంగా కడుపు పై కుడి భాగంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. ఈ నొప్పి దీర్ఘకాలం కొనసాగవచ్చు మరియు దీనికి వైద్య చికిత్స అవసరం కావచ్చు.
జాండిస్: ట్యూమర్ బైల్ డక్ట్లను అడ్డుకోవడం వల్ల చర్మం మరియు కళ్లకు పసుపు రంగు రావడం, అలాగే తీవ్రమైన దురద కలగడం జరుగుతుంది. దీనిని కొలెస్టాటిక్ జాండిస్ అంటారు.
బిలియరీ కోలిక్: పిత్తాశయం లేదా బైల్ డక్ట్లో అడ్డంకి ఏర్పడితే ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి రావచ్చు. దీనినే బిలియరీ కోలిక్ అంటారు.
ద్రవం పేరుకుపోవడం: అధునాతన దశలో ఉన్న GBC పేషెంట్స్ లో ఉదరంలో ద్రవం చేరి కడుపు ఉబ్బరంగా కనిపించవచ్చు, దాంతో అసౌకర్యం మరియు నొప్పి ఏర్పడుతుంది.
మెటాస్టాసిస్: GBC తరచుగా కాలేయం, ప్యాంక్రియాస్ మరియు పెరిటోనియం వంటి సమీప అవయవాలకు వ్యాపిస్తుంది. ఇది చికిత్సను కష్టతరం చేస్తుంది మరియు ప్రోగ్నోసిస్ను మరింత దెబ్బతీయవచ్చు. ఏ అవయవాన్ని ప్రభావితం చేసిందన్నదాని ఆధారంగా మరిన్ని సంక్లిష్టతలు ఏర్పడుతాయి.
పోషకాహార లోపం: ఆకలి తగ్గడం, తినడంలో ఇబ్బంది, జీర్ణ సమస్యలు వంటి కారణాల వల్ల పేషెంట్స్ లు బరువు తగ్గి పోషకాహార లోపానికి గురవుతారు.
శస్త్రచికిత్స సంక్లిష్టతలు: పిత్తాశయ క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత బైల్ లీకేజి, శస్త్రచికిత్స ప్రాంతంలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం లేదా రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు రావచ్చు. ఇవి కోలుకునే సమయాన్ని పెంచుతాయి మరియు అదనపు చికిత్స అవసరం అవుతుంది.
మానసిక ప్రభావం: క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స పేషెంట్స్ లో ఆందోళన, నిరాశ (డిప్రెషన్) వంటి మానసిక సమస్యలకు కారణం కావచ్చు. వీటికి మానసిక సహాయం అవసరం అవుతుంది.
రికరెన్స్:
పిత్తాశయ క్యాన్సర్లో చికిత్స తర్వాత మళ్లీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ముఖ్యంగా శస్త్రచికిత్స తరువాత మొదటి కొన్ని సంవత్సరాలలో. అందుకే క్రమం తప్పకుండా ఫాలో-అప్ మరియు పర్యవేక్షణ అవసరం.
పిత్తాశయ క్యాన్సర్ నిర్ధారణ
Gallbladder Cancer Diagnosis in Telugu
పిత్తాశయ క్యాన్సర్ను గుర్తించడం మరియు చికిత్స చేయడం కష్టం. కొన్ని పరీక్షలు పిత్తాశయ క్యాన్సర్ను గుర్తించడంలో సహాయపడవచ్చు. పిత్తాశయ క్యాన్సర్ను నిర్ధారించడానికి ఉపయోగించే దశలు క్రింద ఉన్నాయి:
- వ్యక్తిగత మరియు కుటుంబ ఆరోగ్య చరిత్ర
- శారీరక పరీక్ష
- రక్త పరీక్షలు
- కాలేయ పనితీరు పరీక్షలు
- రక్త రసాయన అధ్యయనాలు
- ట్యూమర్ మార్కర్లు
- ఇమేజింగ్ పరీక్షలు
- కంప్యూటెడ్ టొమోగ్రఫీ (CT) స్కాన్
- గాడోలినియంతో మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)
- ఉదర అల్ట్రాసౌండ్
- ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (EUS)
- పెర్క్యూటేనియస్ ట్రాన్స్హెపాటిక్ కోలాంజియోగ్రఫీ (PTC)
- ఎండోస్కోపిక్ రేట్రోగ్రేడ్ కోలాంజియోప్యాంక్రియాటోగ్రఫీ (ERCP)
- పోసిట్రాన్ ఎమిషన్ టొమోగ్రఫీ (PET) స్కాన్
- ల్యాపరోస్కోపీ
- బయాప్సీ
పిత్తాశయ క్యాన్సర్ చికిత్స
Gallbladder Cancer Treatment in Telugu
పిత్తాశయ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ లకు అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి. ఈ చికిత్సా ఎంపికలు క్యాన్సర్ దశ, పేషెంట్ యొక్క మొత్తం ఆరోగ్యం మరియు చికిత్స లక్ష్యాల ఆధారంగా ఆంకాలజిస్ట్ / క్యాన్సర్ నిపుణుడు నిర్ణయిస్తారు. కొన్ని చికిత్సలు బాగా స్థిరపడినవి మరియు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి, మరికొన్ని ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్లో పరిశీలించబడుతున్నాయి.
పిత్తాశయ క్యాన్సర్ చికిత్సా ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:
- శస్త్రచికిత్స
- పిత్తాశయ క్యాన్సర్ తొలగింపు (Resection of Gallbladder Cancer):
- కోలిసిస్టెక్టమీ – Cholecystectomy
- ఎక్స్టెండెడ్ కోలిసిస్టెక్టమీ – Extended Cholecystectomy
- ప్యాలియేటివ్ శస్త్రచికిత్స (Palliative Surgery):
- బిలియరీ బైపాస్ – Biliary Bypass
- ఎండోస్కోపిక్ స్టెంట్ ప్లేస్మెంట్ – Endoscopic Stent Placement
- పర్క్యూటేనియస్ ట్రాన్స్హెపాటిక్ బిలియరీ డ్రైనేజ్ (పీటిబీడీ) – Percutaneous Transhepatic Biliary Drainage (PTBD)
- రేడియేషన్ థెరపీ – Radiation Therapy
- కీమోథెరపీ – Chemotherapy
- టార్గెటెడ్ మెడిసిన్స్ మరియు ఇమ్యూనోథెరపీ – Targeted Medicines and Immunotherapy
- క్లినికల్ ట్రయల్స్లో పరీక్షించబడుతున్న కొత్త చికిత్సలు (Newer Therapeutic Options): క్రింది చికిత్సలు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్లో పరిశీలించబడుతున్నాయి:
- రేడియేషన్ సెంసిటైజర్స్ – Radiation Sensitizers
- హైపర్థర్మియా థెరపీ – Hyperthermia Therapy
- రేడియో సెంసిటైజర్స్ – Radiosensitizers
- టార్గెటెడ్ థెరపీ – Targeted Therapy
- ఇమ్యూనోథెరపీ – Immunotherapy
- పిడీ-1 మరియు పిడీ-ఎల్1 ఇన్హిబిటర్ థెరపీ – PD-1 and PD-L1 Inhibitor Therapy
Why Choose PACE Hospitals?
Expert Super Specialist Doctors
Advanced Diagnostics & Treatment
Affordable & Transparent Care
24x7 Emergency & ICU Support
పిత్తాశయ క్యాన్సర్ నివారణ
Gallbladder Cancer Prevention in Telugu
పిత్తాశయ క్యాన్సర్ను పూర్తిగా నివారించడం సాధ్యం కాదు, ఇతర క్యాన్సర్ల మాదిరిగానే. అయితే, కొన్ని జీవనశైలి మార్పులు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి:
నిరంతర వ్యాయామం: రోజువారీ వ్యాయామం ఆరోగ్యకరమైన బరువును కాపాడటానికి మరియు ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి సహాయపడుతుంది, తద్వారా పిత్తాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన బరువు: ఆరోగ్యకరమైన బరువును ఉంచుకోవడానికి సమతుల ఆహారం మరియు క్రమం తప్పని వ్యాయామం అవసరం. ఊబకాయం ఇన్ఫ్లమేషన్ మరియు మెటబాలిక్ సమస్యలను కలిగించి పిత్తాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
పొగత్రాగడం మానడం: పొగత్రాగడం నివారించడం పిత్తాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మద్యపానాన్ని పరిమితం చేయడం: అధిక మద్యపానం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు కణ నష్టం జరుగుతాయి. కావున మద్యపానాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నివారించడం పిత్తాశయ క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది.
పౌష్టికాహారం: పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు మరియు కొవ్వు తక్కువగా ఉన్న, మాంసం ఎక్కువగా ఉండే ఆహారం శరీరానికి చాలా మంచిది. ఇలాంటి సమతుల పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది మరియు శరీరంలో దీర్ఘకాలిక వాపు తగ్గుతుంది. ఇవి రెండూ పిత్తాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
పిత్తాశయ క్యాన్సర్ మరియు పిత్త రాళ్ల మధ్య తేడా
Difference between Gallbladder Cancer and Gallstones in Telugu
పిత్త రాళ్లు మరియు పిత్తాశయ క్యాన్సర్ రెండూ పిత్తాశయాన్ని ప్రభావితం చేసినప్పటికీ, వీటి లక్షణాలు, ప్రమాద కారకాలు మరియు చికిత్సలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిత్త రాళ్లు సాధారణంగా ఎక్కువగా కనిపించే సమస్య కాగా, పిత్తాశయ క్యాన్సర్ అరుదుగా కనిపిస్తుంది. పిత్తాశయ క్యాన్సర్ మరియు పిత్త రాళ్లను వేరు చేయడానికి సహాయపడే కొన్ని పరామితులు క్రింద ఇవ్వబడ్డాయి:
Gallbladder Cancer vs Gallstones in Telugu
| పరామితులు | పిత్తాశయ క్యాన్సర్ | పిత్త రాళ్లు |
|---|---|---|
| నిర్వచనం | పిత్తాశయంలోని అసాధారణ కణాలు నిరంతరం పెరిగి ట్యూమర్ను ఏర్పరచే అరుదైన వ్యాధి. | కొలెస్ట్రాల్ వంటి పదార్థాలు గట్టి నిక్షేపాలుగా పిత్తాశయంలో పేరుకుపోవడం. |
| ప్రమాద కారకాలు | పిత్త రాళ్లు మరియు దీర్ఘకాలిక పిత్తాశయ ఇన్ఫ్లమేషన్. | డయాబెటీస్, ఊబకాయం, కుటుంబ చరిత్ర, గర్భధారణ, బ్యాక్టీరియా/పరాన్నజీవి ఇన్ఫెక్షన్లు, జన్యు లోపాలు. |
| లక్షణాలు | చాలా మందిలో ప్రారంభంలో గుర్తించలేము; తరువాత లింఫ్ నోడ్స్కి వ్యాపించవచ్చు. తరచూ పిత్తాశయం తొలగించిన తరువాత యాదృచ్ఛికంగా గుర్తించబడుతుంది. | కుడి వైపు అకస్మిక ఉదర నొప్పి, వెన్నునొప్పి, వికారం, వాంతులు. ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవచ్చు. |
| నిర్ధారణ | పిత్తాశయం తొలగింపు తర్వాత ఎక్కువగా గుర్తిస్తారు; అల్ట్రాసౌండ్, CT, MRIలో తక్కువగా గుర్తించబడుతుంది. శస్త్రచికిత్సకు ముందు ఇమేజింగ్ మెరుగైన ఫలితాలు ఇస్తుంది. | ఇతర కారణాల కోసం చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగా గుర్తించబడుతుంది. |
| నిర్ధారణ | శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. | ఎక్కువ మందికి చికిత్స అవసరం లేదు. అయితే బిలియరీ కోలిక్ ఉంటే భవిష్యత్తులో నొప్పులు నివారించడానికి కోలిసిస్టెక్టమీ చేస్తారు. |
పిత్తాశయ క్యాన్సర్ పై తరచుగా అడిగే ప్రశ్నలు
పిత్తాశయ క్యాన్సర్ నయం అవుతుందా?
పిత్తాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగిస్తే నయం కావచ్చు. అయితే, ఈ క్యాన్సర్ వేగంగా వ్యాపించే స్వభావం కలిగినందున, చాలా కేసులు తర్వాతి దశల్లోనే గుర్తించబడతాయి, దీని వల్ల చికిత్స ప్రభావాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ పిత్తాశయాన్ని దాటి ఇతర అవయవాలకు వ్యాపించినప్పుడు, సాధారణంగా పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. ఇలాంటి సందర్భాల్లో చికిత్స లక్షణాలను తగ్గించి జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.
అల్ట్రాసౌండ్ ద్వారా పిత్తాశయ క్యాన్సర్ను గుర్తించగలమా?
అవును, అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా పిత్తాశయ క్యాన్సర్ను గుర్తించవచ్చు. పిత్తాశయ సమస్యలను పరిశీలించే మొదటి ఇమేజింగ్ పరీక్ష ఇది. అల్ట్రాసౌండ్ పిత్తాశయం గోడ మందం, లోపలి మాస్లు మరియు క్యాన్సర్ సూచించే ఇతర అసాధారణతలను గుర్తించగలదు. ఇమేజింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినా, పిత్తాశయ ట్యూమర్లలో సుమారు సగం మాత్రమే శస్త్రచికిత్సకు ముందు గుర్తించబడతాయి, అందువల్ల ప్రారంభ దశలో గుర్తించడం కష్టతరం.
పిత్తాశయ క్యాన్సర్ వారసత్వమా?
చాలా పిత్తాశయ క్యాన్సర్ కేసులు వారసత్వ జన్యు మార్పుల వల్ల కాకుండా, జీవితంలో తర్వాత ఏర్పడే జన్యు మార్పుల వలన జరుగుతాయి. కాబట్టి ఈ క్యాన్సర్ను వారసత్వ వ్యాధిగా పరిగణించరు. అయితే కుటుంబంలో పిత్తాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారిలో ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది—సుమారు 5 రెట్లు. అయినప్పటికీ, ఈ వ్యాధి అరుదు కావడంతో మొత్తం ప్రమాదం తక్కువగానే ఉంటుంది. జన్యు సంబంధిత అంశాలు పాత్ర పోషించవచ్చు కానీ ఇంకా స్పష్టమైన ఆధారాలు కావాలి.
ఆహారం పిత్తాశయ క్యాన్సర్కు సంబంధితమా?
అవును, ఆహారం పిత్తాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక కొవ్వు ఉన్న ఆహారం, ఊబకాయం, ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రమాదాన్ని పెంచుతాయి. మరోవైపు, పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే ఆహారం కొంత రక్షణ కలిగిస్తుంది.
పిత్తాశయ క్యాన్సర్ చికిత్స తర్వాత మళ్లీ రావచ్చా?
అవును, పిత్తాశయ క్యాన్సర్కు రికరెన్స్ (మళ్లీ రావడం) ప్రమాదం ఉంది, ముఖ్యంగా తర్వాతి దశల్లో గుర్తించబడిన సందర్భాల్లో. అందుకే చికిత్స తర్వాత క్రమం తప్పని ఫాలో-అప్ చాలా ముఖ్యము.
స్టేజ్ 4 పిత్తాశయ క్యాన్సర్ నయం అవుతుందా?
స్టేజ్ 4 పిత్తాశయ క్యాన్సర్ సాధారణంగా నయం చేసుకోలేనిది, ఎందుకంటే స్టేజ్ 4 లో ఇతర అవయవాలకు వ్యాపించి ఉంటుంది . కొందరు పేషెంట్స్ లు విస్తృతమైన చికిత్స (శస్త్రచికిత్సతో సహా) పొందినప్పటికీ, మొత్తం ప్రోగ్నోసిస్ సాధారణంగా బలహీనంగా ఉంటుంది. శస్త్రచికిత్స చేయలేని సందర్భాల్లో సగటు జీవనకాలం సుమారు 8 నెలలు. ఈ దశలో చికిత్స లక్షణ నియంత్రణ మరియు జీవన నాణ్యత మెరుగుదలపై దృష్టి పెడుతుంది.
పిత్తాశయ పాలిప్స్ క్యాన్సర్నా?
సాధారణంగా పిత్తాశయ పాలిప్స్ క్యాన్సర్ కావు, దాదాపు 95% పాలిప్స్ బెనైన్ (క్యాన్సర్ కాదు). అయితే పాలిప్ పరిమాణం పెరిగే కొద్దీ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. 10 mm కంటే పెద్ద పాలిప్స్లో క్యాన్సర్ అవకాశాలు సుమారు 5.9% వరకు ఉంటాయి. అందువల్ల పెద్ద పాలిప్స్ను క్రమం తప్పని పర్యవేక్షణ చేయాలి.
పిత్తాశయ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు?
పిత్తాశయ క్యాన్సర్ను వైద్య చరిత్ర, శారీరక పరీక్ష మరియు ఇమేజింగ్ పరీక్షల కలయికతో నిర్ధారిస్తారు. అల్ట్రాసౌండ్, CT స్కాన్ మరియు MRI ద్వారా పిత్తాశయం మరియు చుట్టుపక్కల కణజాలాలను పరిశీలించి ట్యూమర్ పరిమాణం మరియు స్థానాన్ని గుర్తిస్తారు. అదనంగా, కాలేయ పనితీరు పరీక్షలు, ట్యూమర్ మార్కర్లు మరియు బయాప్సీ ద్వారా క్యాన్సర్ కణాల ఉనికిని నిర్ధారిస్తారు.
పిత్తాశయం తొలగించిన తర్వాత క్యాన్సర్ రావచ్చా?
కోలిసిస్టెక్టమీ (పిత్తాశయం తొలగింపు) తర్వాత కాలేయంలోని బైల్ డక్ట్లలో ఒత్తిడి పెరగడం వల్ల కాలేయ కణజాలంలో దీర్ఘకాలిక వాపు కలగవచ్చు. దీని వల్ల క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉందని భావించబడుతుంది.
పిత్తాశయ క్యాన్సర్ ప్రోగ్నోసిస్ ఏమిటి?
పిత్తాశయ క్యాన్సర్కు సాధారణంగా ప్రోగ్నోసిస్ బలహీనంగా ఉంటుంది. వ్యాధి ఆలస్య దశల్లో గుర్తించబడినప్పుడు 5 సంవత్సరాల జీవన శాతం 5% కంటే తక్కువ. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే జీవన శాతం 75% వరకు ఉండవచ్చు.
పిత్తాశయ క్యాన్సర్ ఎలా స్టేజ్ చేయబడుతుంది?
ఇమేజింగ్ పరీక్షల ద్వారా ట్యూమర్ పరిమాణం, అది సమీప అవయవాలకు లేదా లింఫ్ నోడ్స్కి వ్యాప్తి చెందిందా అనేది తెలుసుకుంటారు. దీనిని ఆధారంగా స్టేజింగ్ (దశ నిర్ణయం) చేస్తారు. స్టేజింగ్ 0 (స్థానికంగా మాత్రమే) నుండి IV (అత్యంత వ్యాప్తి చెందిన దశ) వరకు ఉంటుంది.
పిత్తాశయ క్యాన్సర్ కోసం ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
పిత్తాశయ క్యాన్సర్ అరుదైనప్పటికీ తీవ్రమైన వ్యాధి. లక్షణాలు సాధారణంగా ఆలస్యంగా కనిపిస్తాయి, అందువల్ల సమయానికి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
ముఖ్య హెచ్చరిక లక్షణాలు:
- కడుపు పై కుడి వైపు నిరంతర నొప్పి
- కారణం లేకుండా బరువు తగ్గడం మరియు ఆకలి కోల్పోవడం
- వికారం, వాంతులు లేదా జీర్ణ సమస్యలు
- జాండిస్
- కడుపు వాపు
- అలసట లేదా బలహీనత
ఈ లక్షణాలు ఉంటే, వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పిత్తాశయ క్యాన్సర్ నిపుణుడు, లేదా ఆంకాలజిస్టును సంప్రదించడం అత్యంత అవసరం.
Share on
Request an appointment
Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868








